సొంత గ్రామం సింగపూర్‌లో హిట్టు కొట్టిన ప్రణవ్
హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జయకేతనం
వరుస విజయాలతో పార్టీపై పెరిగిన బాధ్యత
కాకతీయ, హుజూరాబాద్ : మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. నాలుగు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించి ప్రజల మద్దతును చూరగొన్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు తనదైన రాజకీయ వ్యూహంతో ముందుకెళ్లిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ కీలక పాత్ర పోషించినట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. సొంత గ్రామం సింగపూర్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం విశేషంగా నిలిచింది. ప్రభుత్వంలో ఉన్న పార్టీగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రానున్న రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా వివరించడంలో కాంగ్రెస్ నేతలు సఫలమయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ తృటిలో విజయాలు చేజారిన చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులు బలమైన పోరాటం చేశారు.
ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకం మరింత పెరిగిందని, అదే సమయంలో పార్టీపై బాధ్యత కూడా పెరిగిందని నాయకులు భావిస్తున్నారు. గత పదేళ్ల పాలన తర్వాత రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి దిశ ప్రజలను ఆకర్షించిందని పేర్కొన్నారు. ఈ విజయాలతో రెట్టింపు ఉత్సాహంతో రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


