సుక్మా అడవుల్లో ఎన్‌కౌంటర్!
ముగ్గురు మావోయిస్టులు హతం
భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల స్వాధీనం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ డిసెంబర్ 18 గురువారం ఉదయం సుక్మా జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనగుడ–దులేడ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), బస్తర్ ఫైటర్స్ దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో అటవీ ప్రాంతంలో దాక్కున్న మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులకు దిగగా, కొంతసేపు తీవ్రంగా కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు.
తుపాకులు, ఐఈడీలు స్వాధీనం..గాలింపు ముమ్మరం
ఎన్‌కౌంటర్ అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడ పట్టగా, తుపాకులు, గుండ్లు, ఐఈడీలు సహా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ ప్రాంతానికి సమీపంలో మరికొందరు మావోయిస్టులు దాక్కుని ఉండే అవకాశం ఉన్నందున అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అదనపు బలగాలను కూడా రంగంలోకి దింపినట్లు సమాచారం.సుక్మా జిల్లాలో మావోయిస్టుల కదలికలను కట్టడి చేయడానికి భద్రతా బలగాలు చేపడుతున్న వరుస ఆపరేషన్లలో ఇది మరో కీలక ఘట్టంగా అధికారులు పేర్కొన్నారు.


