- ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమంలో విద్యార్థులకు సూచనలు
కరీంనగర్, కాకతీయ: బాల్ వివాహ్ ముక్త్ భారత్ వంద రోజుల ప్రణాళికలో భాగంగా కరీంనగర్ నగరంలోని ఓల్డ్ హైస్కూల్లో బుధవారం బాల వివాహాల నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాల వివాహాల నిరోధక చట్టంలోని ముఖ్య నిబంధనలు, వివాహానికి నిర్దేశించిన కనీస వయస్సు, చట్టపరమైన అర్హతలు తదితర అంశాలపై వివరించారు. బాల్య వివాహాల వల్ల కలిగే సామాజిక, ఆరోగ్యపరమైన సమస్యలను తెలియజేస్తూ, చట్టాన్ని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని వక్తలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ ఆవుల సంపత్ యాదవ్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ప్రతినిధి సాదినేని రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసుంధరతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాల వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని, ఎక్కడైనా సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు తెలియజేయాలని వక్తలు సూచించారు


