కార్మిక భవనం మార్చిలోపు నిర్మించాలి
లేదంటే 318 మంది ఫ్లాట్లు కేటాయించాలి
కల్లబొల్లి మాటలతో అధికారంలోకి రేవంత్ సర్కారు
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు
కాకతీయ, వరంగల్ సిటీ : ఆజంజాహీ మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, మార్చి 31లోపు కార్మిక భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆజంజాహీ మిల్లు కార్మిక భవన పునర్నిర్మాణ అంశంపై గంగుల దయాకర్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నన్నపనేని నరేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎన్నికల సమయంలో ఆజంజాహీ మిల్లు కార్మికులకు న్యాయం చేస్తామని వరంగల్ పోస్ట్ ఆఫీస్ వద్ద అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల భవనం స్థలంలో ప్రైవేటు వ్యక్తుల తరఫున శంకుస్థాపన చేయడం దారుణమన్నారు. అనంతరం మళ్లీ కార్మిక భవనం నిర్మిస్తామని కొండా మురళి చేసిన ప్రకటనకు ఏడాది గడిచినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. ప్రకటనలు, హామీలే తప్ప కార్మిక భవన నిర్మాణంపై కానీ, కార్మికులకు కేటాయించాల్సిన ప్లాట్ల విషయంలో కానీ స్పష్టమైన ఫలితం కనిపించడం లేదన్నారు.
మార్చి 31లోపు స్పష్టతివ్వాలి
మార్చి 31లోపు కార్మిక భవనం నిర్మాణం చేపడతారా? లేక నూతన కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోని ప్రభుత్వ భూమిలో 318 మంది కార్మికులకు ఫ్లాట్లు కేటాయిస్తారా? అన్న విషయంపై వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సహనాన్ని పరీక్షించే విధంగా వ్యవహరించవద్దని హెచ్చరించిన నన్నపనేని నరేందర్… మార్చి 31లోపు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే అఖిలపక్షాలు కలిసి తదుపరి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతామని తెలిపారు. అవసరమైతే కార్మికులే చందాలు వేసుకుని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి, కార్మిక భవన నిర్మాణాన్ని పూర్తిగా చేపట్టే బాధ్యత తనదేనని కార్మికులకు హామీ ఇచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, మాజీ మేయర్ రాజేశ్వరరావు, మాజీ ఎంపీ సీతారామనాయక్, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


