ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జాగృతి ‘జనం బాట’
కవిత నాయకత్వంలో ప్రజా ఉద్యమంగా విస్తరిస్తున్న తెలంగాణ జాగృతి
*జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్
కాకతీయ, కరీంనగర్ : జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి బలమైన వేదికగా మారిందని తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. కరీంనగర్‌లో జిల్లా జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కవితక్క ‘జనం బాట’ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఐడీపీఎల్ భూముల అంశంపై కవితక్క లేవనెత్తిన ప్రశ్నలకు స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గత రెండు నెలలుగా 11 జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల గోడును వింటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ తెలంగాణ జాగృతి ప్రజా ఉద్యమంగా ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రజల సూచనలు, సలహాలు స్వీకరిస్తూ జాగృతిని బలోపేతం చేస్తున్న ఈ ఉద్యమాన్ని కొంతమంది స్వార్థపరులు, కబ్జాకోరులు తట్టుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యాఖ్యలను జాగృతి కరీంనగర్ జిల్లా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ సాధించాలనే లక్ష్యంతో కవితక్క ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, అది ఓర్వలేక కొంతమంది నాయకులు పథకం ప్రకారం ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉండి బీసీలకు న్యాయం చేయని బీజేపీని కూడా కవిత ప్రజల ముందు ప్రశ్నిస్తున్నారని స్పష్టం చేశారు. జనం బాటకు వస్తున్న ప్రజల స్పందన చూస్తుంటే తెలంగాణ జాగృతిని రాజకీయ వేదికగా మారుస్తూ రాష్ట్రానికి కవితక్క నాయకత్వం వహించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల్లో ఈ ఆకాంక్ష బలంగా వ్యక్తమవుతోందని, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మద్దతు ఇందుకు నిదర్శనమన్నారు. కవితపై అసత్య ప్రచారం, అనవసర విమర్శలు చేస్తే జాగృతి కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాగృతి జిల్లా నాయకులు బూడిగ పరుశురాం గౌడ్, రంగరవేణి లక్ష్మణ్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, ఆటో విభాగం జిల్లా నాయకులు కొత్తూరి రఘు, జిల్లా నాయకులు గర్షకుర్తి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


