ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
అతివేగమే ప్రమాదానికి కారణమా..?
కాకతీయ,మరిపెడ: అతివేగంగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మరిపెడ మండలంలోని బురహాన్పురం గ్రామ శివారు పత్తి మిల్లు సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మరిపెడ మండలం తానంచర్ల పరిధిలోని రెడ్యా తండాకు చెందిన గుగులోతు సైదులు ద్విచక్ర వాహనంపై మరిపెడ మండల కేంద్రానికి వెళ్తుండగా, అదే సమయంలో బురహాన్పురం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీకాంత్ మరిపెడ నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో పత్తి మిల్లు వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


