25 రోజులుగా తాగునీరు లేక ప్రజల అవస్థలు
పిట్టలవాడ ఎస్సీ కాలనీలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం
కాకతీయ ,హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డ్ పిట్టలవాడ ఎస్సీ కాలనీలో గత 25 రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నీరు అందక కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తాగునీరు, వంట, స్నానం వంటి కనీస అవసరాలకే ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, గర్భిణీలు అత్యధికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.ఈ సమస్యపై పలుమార్లు మున్సిపాలిటీ అధికారులకు, సంబంధిత ఏఈకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆరోపిస్తున్నారు. నీటి సరఫరాకు బాధ్యత వహించే ఫిట్టర్‌ను సంప్రదించినా నిర్లక్ష్య సమాధానాలే వస్తున్నాయని తెలిపారు.ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడంతో కాలనీ వాసుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరించాలని, నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.


