బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత
సమాచారం ఉంటే 1098కు తెలియజేయాలి
సీహెచ్‌ఎల్ కోఆర్డినేటర్ సంపత్
కాకతీయ, కరీంనగర్ : బాల్య వివాహాలను నిరోధించడం, వాటి నిర్మూలనకు కృషి చేయడం సమాజంలోని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని చైల్డ్ హెల్ప్‌లైన్ (1098) జిల్లా కోఆర్డినేటర్ ఆవుల సంపత్ తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలో ‘బాల్య వివాహ ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో బాల్య వివాహాలపై మంగళవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ, బాల్య వివాహాలు చేయడం లేదా ప్రోత్సహించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు ఎవరికైనా సమాచారం తెలిస్తే, తక్షణమే 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండకముందే వివాహం జరిపించడం వల్ల శారీరక, మానసిక అనర్థాలు సంభవిస్తాయని ఆయన వివరించారు. అలాంటి వివాహాల ద్వారా జన్మించే పిల్లలు ఆరోగ్య సమస్యలు, వైకల్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. యుక్తవయసు పిల్లలతో తల్లిదండ్రులు ప్రేమగా, బాధ్యతతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్‌లైన్ కేస్ వర్కర్ ప్రియాంక, పాఠశాల ఉపాధ్యాయులు రంగయ్య, ఉషావాణి, మహిళా సంఘాల ప్రతినిధి వివో పావని, అంగన్‌వాడీ టీచర్ సుజాత, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.


