గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి: సర్పంచి తమ్మడపల్లి కుమార్
కాకతీయ, ఇనుగుర్తి : నాపై ఉంచిన నమ్మకంతో ఇనుగుర్తి గ్రామ ప్రజలు సర్పంచిగా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నూతనంగా ఎన్నికైన మండల కేంద్రం ఇనుగుర్తి సర్పంచి తమ్మడపల్లి కుమార్ అన్నారు. మంగళవారం ఇనుగుర్తిలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి సర్పంచ్‌గా అవకాశం కల్పించిన గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తామని స్పష్టం చేశారు. సమిష్టి కృషితో గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. విపక్షాలు ఇచ్చే నిర్మాణాత్మక సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
పార్టీ కార్యక్రమాలు ఏవైనా ఉన్నా, నాయకులకు, కార్యకర్తలకు సమాచారం అందించి, అభివృద్ధి పనులలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్తుర్ యాదగిరి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, ఏఎంసి డైరెక్టర్ కొట్టం రాము, శ్రీనివాసరెడ్డి, చిన్నాల కట్టయ్య యాదవ్, కొలిపాక నారాయణ, రామ్ సలీం తదితరులు పాల్గొన్నారు.


