టీఆర్పీలో మహిళల చేరిక
పార్టీ బలోపేతానికి ముందుండాలి : అఖిల్ పాషా
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కార్యాలయంలో మహిళల భారీ చేరికలు జరిగాయి. మహిళా టౌన్ అధ్యక్షురాలు జింక లావణ్య ఆధ్వర్యంలో పలువురు మహిళలు పార్టీలో చేరారు. నూతన సభ్యులకు సభ్యత్వ నమోదు అనంతరం రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షురాలు గంగిపెళ్లి అరుణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల్ పాషా మాట్లాడుతూ.. స్వాతంత్య్రం తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయంగా సరైన న్యాయం జరగలేదని విమర్శించారు. తెలంగాణలో బీసీలకు నిజమైన న్యాయం చేయగల ఏకైక పార్టీ టీఆర్పీ మాత్రమేనని పేర్కొన్నారు. పార్టీలో మాజీలకు అవకాశం లేదని, కొత్త రాజకీయ నాయకత్వాన్ని తయారు చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీసీ రాజ్యాధికారం సాధించడంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. పార్టీని బలోపేతం చేయడంలో నూతనంగా చేరిన సభ్యులు ముందువరుసలో నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గంగిపెళ్లి అరుణ, మహిళా టౌన్ అధ్యక్షురాలు జింక లావణ్య, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.


