మేడారం భక్తులకు మెరుగైన రవాణాయే లక్ష్యం
అధిక సంఖ్యలో ప్రత్యేక బస్సులు: టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ నాగిరెడ్డి
కాకతీయ/ములుగు ప్రతినిధి : శ్రీ సమ్మక్క–సారలమ్మ మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా టీఎస్‌ఆర్‌టీసీ పనిచేస్తోందని సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి తెలిపారు. మంగళవారం తాడ్వాయి మండలంలోని మేడారంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్‌రామ్‌నాథ్ కేకన్‌లతో కలిసి ఆయన వనదేవతలు శ్రీ సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం మేడారం జాతర ఏర్పాట్లపై ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, జాతర సందర్భంగా సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక ఆర్టీసీ బస్టాండ్, బస్సుల పార్కింగ్, క్యూలైన్లు, ప్రయాణికులు వేచి ఉండేందుకు గదులు తదితర ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతామని, డ్రైవర్లు, కండక్టర్లు, సాంకేతిక సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ, గత జాతర అనుభవాల ఆధారంగా ఈసారి రవాణాపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. తాడ్వాయి–మేడారం అటవీ మార్గంలో సిగ్నల్ సమస్య ఉన్న నేపథ్యంలో ప్రతి కిలోమీటర్‌కు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనికేషన్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఆర్టీసీ ఈడీఎం మునిశేఖర్, ఈడీలు వెంకన్న, సాల్మన్, ఆర్ఎంలు విజయభాను, రవిచంద్రతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


