ఓపెన్ఏఐ సంచలనం.. చాట్‌జీపీటీలో ఇకపై ఆ కంటెంట్ కూడా..!
జీపీటీ-5.2తో ఓపెన్ఏఐ కీలక ప్రకటన
వయోజనుల కోసం ప్రత్యేకంగా అడల్ట్ మోడ్
కాకతీయ, నేషనల్ డెస్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో మరోసారి ఓపెన్ఏఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాట్‌జీపీటీతో చదువు, ఉద్యోగాలు, బిజినెస్, సృజనాత్మకత రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఓపెన్ఏఐ… ఇప్పుడు మరింత సున్నితమైన అంశాల వైపు అడుగులు వేస్తోంది. వయోజన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని చాట్‌జీపీటీలో ప్రత్యేకంగా ‘అడల్ట్ మోడ్’ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త ఫీచర్ 2026 మొదటి త్రైమాసికంలో అందుబాటులోకి రానుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఓపెన్ఏఐ అప్లికేషన్స్ సీఈఓ ఫిడ్జీ సిమో, తాజా జీపీటీ-5.2 మోడల్‌పై నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వినియోగదారుల అవసరాలు మారుతున్న నేపథ్యంలో, బాధ్యతాయుతంగా సున్నితమైన కంటెంట్‌ను హ్యాండిల్ చేయడమే లక్ష్యంగా ఈ అడల్ట్ మోడ్‌ను రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. అయితే అడల్ట్ మోడ్‌ను కేవలం వయసు ధ్రువీకరణ పూర్తిచేసుకున్న వయోజనులకే అనుమతించనున్నారు. మైనర్లు ఈ కంటెంట్‌ను ఏ పరిస్థితుల్లోనూ యాక్సెస్ చేయకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఓపెన్ఏఐ స్పష్టం చేసింది.
ఇప్పటికే కొన్ని దేశాల్లో వయసు నిర్ధారణ విధానాలను ట్రయల్ బేసిస్‌లో పరీక్షిస్తున్నట్లు సమాచారం. చాట్‌జీపీటీ వినియోగదారులందరికీ ఈ అడల్ట్ మోడ్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లోనే ఉంటుంది. అవసరమున్న వారు ప్రత్యేకంగా అభ్యర్థించి, వయసు ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఈ మోడ్‌ను ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ మోడ్‌లో కూడా కొన్ని స్పష్టమైన పరిమితులు, మార్గదర్శకాలు ఉంటాయని సంస్థ తెలిపింది.
ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కూడా ఈ అప్‌డేట్‌పై స్పందించారు. సున్నితమైన కంటెంట్ విషయంలో సమాజపరమైన బాధ్యత అత్యంత కీలకమని పేర్కొన్నారు. వినియోగదారుల స్వేచ్ఛ, భద్రత రెండింటి మధ్య సమతౌల్యం సాధించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. కాగా, చాట్‌జీపీటీలో అడల్ట్ మోడ్ ప్రవేశంపై ఇప్పటికే టెక్ వర్గాల్లో విస్తృత చర్చ మొదలైంది. ఇది ఏఐ వినియోగానికి కొత్త దిశ చూపుతుందా? లేక వివాదాలకు దారి తీస్తుందా? అన్న అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం… ఓపెన్ఏఐ తీసుకున్న ఈ నిర్ణయం ఏఐ రంగంలో మరో కీలక మలుపుగా నిలవనుంది.


