తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేయొద్దు
*మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొదటి విడత, రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామపంచాయతీలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అలాగే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలందరికీ పంచాయతీరాజ్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 5,856 గ్రామాలకు సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లుగా ఎన్నికైన వారందరికీ ఆమె అభినందనలు తెలిపారు. గత రెండేళ్లుగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. కులగణన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ, అక్కడే అది ఆగిపోయిందన్నారు. గ్రామాలకు పూర్తిస్థాయి నిధులు రావాలంటే మార్చిలోపు గ్రామపంచాయతీ, మండల పరిషత్ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ఉద్దేశంతోనే రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించామని స్పష్టం చేశారు. రేపు జరగనున్న మూడో విడత ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, జిల్లా పరిపాలన, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులతో పాటు కొంతమంది స్వతంత్రులు కూడా విజయం సాధించారని మంత్రి తెలిపారు. స్థానిక సమస్యల కారణంగా కొన్ని చోట్ల టికెట్లు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ రెబల్స్ నాలుగు గ్రామాల్లో గెలుపొందారని పేర్కొన్నారు. ఇది ములుగు నియోజకవర్గ ప్రజల విజయం అని, కష్టపడ్డ ప్రతి కార్యకర్త, నాయకుడి విజయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల జనరల్ సీట్లలో కూడా బీసీ అభ్యర్థులకు అవకాశాలు కల్పించిందని, దీనిని సహించలేక కొందరు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా “సీతక్క గడ్డమీద షాక్” అనే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని బిఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి సొంత గ్రామమైన దేవగిరిపట్నంలోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, కాల్వపల్లి గ్రామంలో కూడా కాంగ్రెస్ గెలిచిందని ఆమె గుర్తు చేశారు. ప్రజలు బిఆర్ఎస్ పార్టీని తిరస్కరించినందుకే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకులు బుద్ధి తెచ్చుకుని ప్రజల అభివృద్ధికి సహకరించి కనీస రాజకీయ మర్యాద పాటించాలని మంత్రి సీతక్క హితవు పలికారు.ఈ సమావేశంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, పిఏసిఎస్ చైర్మన్ బొక్కా సత్తి రెడ్డి, ములుగు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి, మత్స్య శాఖ జిల్లా అధ్యక్షుడు కంబాల రవి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి తదితరులు పాల్గొన్నారు.


