గుర్రం తన్నడంతో బాలుడు మృతి
ఖిలా వరంగల్ కోటలో అనుమతులు లేకుండానే గుర్రపు స్వారీలు
పార్క్ ఆదాయానికే పరిమితమైన కుడా పర్యవేక్షణ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఖిలా వరంగల్ ఏకశిలా పిల్లల పార్క్‌లో చోటుచేసుకున్న దుర్ఘటన నగరాన్ని కలచివేసింది. సరదాగా విహారయాత్రకు వచ్చిన ఓ బాలుడు గుర్రం తన్నడంతో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో అధికారులు, పార్క్ నిర్వాహకుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఖిలా వరంగల్‌లో కుడా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకశిలా పిల్లల పార్క్‌లో అనుమతులు లేకుండానే కొందరు వాణిజ్యపరంగా గుర్రపు స్వారీలు నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్యాటకుల భద్రతను పూర్తిగా విస్మరించి పార్క్ కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న శివనగర్‌కు చెందిన మిర్యాల గౌతమ్ తన బాబాయ్ రాజేందర్, అన్న మహేష్‌లతో కలిసి ఏకశిలా పిల్లల పార్క్‌కు విహారయాత్రకు వచ్చాడు. బాలుడు పార్క్‌లో ఆడుకుంటుండగా అక్కడే ఉన్న గుర్రం అకస్మాత్తుగా ఛాతిపై కాలుతో తన్నింది. తీవ్రంగా గాయపడిన గౌతమ్‌ను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిల్స్‌కాలనీ ఎస్‌ఐ శ్రవణ్‌కుమార్ శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనతో పార్క్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం బాలుడి కుటుంబ సభ్యులు పార్క్ ఎదుట ధర్నా నిర్వహించి, తమ కుమారుడి మృతికి కారణమైన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న మిల్స్‌కాలనీ ఎస్‌ఐ సంబంధిత నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
పిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్క్‌లో అనుమతులు లేకుండా గుర్రపు స్వారీలు ఎలా నిర్వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర కార్యకలాపాలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


