అభివృద్ధి వైపు కాంగ్రెస్.. బెదిరింపుల వైపు బీఆర్ఎస్
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 17న జరిగే మూడవ విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామాల అభివృద్ధికి సహకరించవచ్చని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.
సోమవారం హుజురాబాద్ మండలంలోని మాందాడిపల్లి, రాజపల్లి, పొతిరెడ్డి పేట, జూపాక మరియు జమ్మికుంట మండలంలోని మడిపల్లి, వీణవంక, హిమ్మత్ నగర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామవాసులు, మహిళలు బాణాసంచా, డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రణవ్ మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉండి గ్రామాల్లో సమస్యలను పరిష్కరించకుండా ఎన్నికలు రాగానే అభివృద్ధి గురించి బీఆర్ఎస్ పార్టీ హాస్యాస్పదంగా మాట్లాడటం, బెదిరింపు రాజకీయాలు చేయడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. కార్యకర్తలపై బెదిరింపులు పెట్టితే ఊరుకోరని ఈ ప్రాంతంలో ఓడిపోతే వెంటనే పక్క ప్రాంతానికి వెళ్ళిన నాయకుడు అవసరం లేదని ప్రశ్నించారు. గత 2 సంవత్సరాల్లో తట్టెడు మట్టి కూడా తీయని కౌశిక్ రెడ్డి రాబోయే 3 సంవత్సరాల్లో ఏం చేస్తాడని, ఇలాంటి నాయకుడికి దిక్కు లేకుండా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం వల్ల ఏ ఉపయోగం ఉంటుందో అని అన్నారు. ప్రజలను చక్కగా అభివృద్ధి చేసే నాయకులను మాత్రమే ఎన్నుకోవాలి అని సూచించారు. ప్రణవ్ బుధవారం పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


