ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి
: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
కాకతీయ, జనగాం : జనగామ జిల్లాలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా తొలి, రెండో విడతల మాదిరిగానే ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. మూడో విడత ఎన్నికలు జరగనున్న దేవరోప్పుల, పాలకూర్తి, కొడకండ్ల మండలాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్ గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, జడ్పీ సీఈఓ, ఆర్డీవోలు, డీఆర్‌డీవో, డీఎస్‌డీవో, ఆర్టీఓ, మండల ప్రత్యేక అధికారులు, డీఎల్‌పీఓ, కలెక్టరేట్ ఏఓ, సూపరింటెండెంట్లు, ఈడీఎం, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల సామగ్రి పంపిణీ సక్రమంగా జరగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ విధులు నిర్వహించే అధికారులకు నాణ్యమైన భోజనం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, నీరు, మరుగుదొడ్లు వంటి అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా తగినంత సిబ్బందిని నియమించుకోవాలని, పోలింగ్ రోజునే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించిన అన్ని నివేదికలను నిర్దేశిత సమయాల్లో, నిర్ణీత ఫార్మాట్‌లకు అనుగుణంగా టీపోల్‌లో సబ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. నోడల్ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీస్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, జోనల్ ఆఫీసర్లు, ఆర్వోలు, పీవోలు, ఓపీవోలు, మైక్రో అబ్జర్వర్లు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు.


