ఏకగ్రీవం మిస్.. ఒక్క ఓటుతో గెలుపు
ఆశాలపల్లి సర్పంచ్‌గా మల్లమ్మ సంచలన విజయం
కాకతీయ, సంగెం : వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితం వెలువడింది. ఎస్సీకి రిజర్వ్ అయిన సర్పంచ్ స్థానంలో ఏకగ్రీవం అవుతుందని భావించిన ఎన్నిక చివరి క్షణంలో మలుపు తిరిగి, కేవలం ఒక్క ఓటు తేడాతో ఫలితం తేలింది. గ్రామంలో ఏకైక ఎస్సీ ఓటర్‌గా ఉన్న కొంగర మల్లమ్మనే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారంటూ మొదట ప్రచారం జరిగింది. అయితే చివరి క్షణంలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ ఎస్సీ యువతి ఎంట్రీ ఇవ్వడంతో ఎన్నిక అనివార్యమైంది. తాజా ఫలితాల్లో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థికి 823 ఓట్లు రాగా, కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన కొంగర మల్లమ్మకు 824 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో మల్లమ్మ సర్పంచ్‌గా గెలుపొందారు. ఏకగ్రీవం మిస్ అయినా, ఒక్క ఓటుతో వచ్చిన ఈ విజయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువ ఎంత కీలకమో ఈ ఫలితం మరోసారి రుజువు చేసిందని గ్రామస్తులు పేర్కొన్నారు.


