డ్రైనేజీ చాంబర్లతో ధ్వంసమైన రోడ్లు
పొర్లుదండాల తో వినూత్నంగా నిరసన చేసిన యువకుడు
స్మార్ట్ సిటీ పనులపై జనాగ్రహం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద చేపట్టిన అండర్ డ్రైనేజీ పనులు కిసాన్నగర్ 3వ డివిజన్‌లో ప్రజలకు తీరని ఇబ్బందులు కలిగిస్తున్నాయి. డ్రైనేజీ చాంబర్లు సక్రమంగా పూర్తికాకపోవడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రహదారులపై పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడి, వర్షపు నీరు-మురుగు నీరు నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తరచూ జారి పడుతుండగా, వృద్ధులు, పిల్లలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.ఈ పరిస్థితిపై అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ దళిత మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణు ప్రసాద్ వినూత్నంగా ఆందోళన చేపట్టారు. డివిజన్‌లో అత్యంత దెబ్బతిన్న రోడ్డుపై పొర్లుదండాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పాలకులు, అధికారులు గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నదే తన ఉద్దేశమని ఆయన తెలిపారు.స్మార్ట్ సిటీ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, పనుల నాణ్యతలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్థానికులు మండిపడ్డారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను తాత్కాలికంగా పూడ్చిపెట్టే విధానం కాకుండా శాశ్వతంగా బాగుచేయాలని డిమాండ్ చేశారు. సమస్యపై త్వరితగతిన స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాలనీవాసులు హెచ్చరించారు.



