ఏఐలో దూసుకెళ్తున్న ప్రపంచ దేశాలు.. ఇండియా ర్యాంక్ ఎంతంటే?
2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ నివేదికలో భారత్ సత్తా
నాలుగు స్థానాలు ఎగబాకి టాప్–3లో చోటు
అభివృద్ధి చెందిన దేశాలకే షాక్ ఇచ్చిన ఇండియా ర్యాంక్
కాకతీయ, నేషనల్ డెస్క్ : కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచ దేశాల మధ్య కొత్త తరహా పోటీకి తెరలేపింది. ఒకప్పుడు టెక్నాలజీ సహాయక సాధనంగా మాత్రమే భావించిన ఏఐ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలు, జాతీయ భద్రత, పాలన, ఉపాధి రంగాల భవిష్యత్‌ను నిర్ణయించే కీలక శక్తిగా మారింది. అయితే ఈ గ్లోబల్ ఏఐ రేసులో భారత్ ఊహించని వేగంతో దూసుకెళ్తోంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన ‘2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్’ నివేదిక ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించింది.
స్టాన్‌ఫోర్డ్ రూపొందించిన ‘2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్’ ప్రకారం… భారత్ ఏఐ అభివృద్ధి, వినియోగంలో ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరింది. గత ఏడాదితో పోలిస్తే భారత్ ఏకంగా నాలుగు స్థానాలు ముందుకు రావడం విశేషం. పరిశోధన–అభివృద్ధి, నైపుణ్యాలు, పెట్టుబడులు, ప్రభుత్వ విధానాలు, మౌలిక వసతులు, ప్రజాభిప్రాయం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్‌ను సిద్ధం చేశారు.
ఈ సూచీలో అమెరికా 78.6 స్కోర్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టెక్నాలజీ దిగ్గజాలు, విశాల పెట్టుబడులు, పరిశోధన సామర్థ్యం అమెరికాను ముందుండేలా చేశాయి. ఇక చైనా 36.95 స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచింది. సెమీకండక్టర్లు, ఏఐ పరిశ్రమలపై భారీ పెట్టుబడులు చైనా బలంగా మారడానికి కారణమయ్యాయి. ఈ రెండు దేశాల తర్వాత భారత్ 21.59 స్కోర్‌తో మూడో స్థానాన్ని దక్కించుకోవడం గ్లోబల్ టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా ఐటీ రంగంలో భారత్‌కు ఉన్న అనుభవం, స్టార్టప్ సంస్కృతి, యువ నైపుణ్యవంతుల సంఖ్య ఈ ఎదుగుదలకు బలమయ్యాయి. ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆశ్చర్యకరంగా సౌత్ కొరియా(17.24), యునైటెడ్ కింగ్‌డమ్(16.64), సింగపూర్(16.43), స్పెయిన్(16.37), యూఏఈ(16.06), జపాన్(16.04) వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ ర్యాంకింగ్స్‌లో భారత్ కంటే దిగువ స్థానాల్లోనే ఉన్నాయి. ఇది భారత్ ఏఐ రంగంలో సాధించిన పురోగతికి స్పష్టమైన నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఏఐ ప్రాధాన్యతను గుర్తించిన ప్రపంచ ప్రభుత్వాలు ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. చైనా సెమీకండక్టర్ పరిశ్రమ కోసం బిలియన్ల డాలర్ల నిధులు కేటాయిస్తే, ఫ్రాన్స్, సౌదీ అరేబియా వంటి దేశాలు వందల బిలియన్ల పెట్టుబడులను ప్రకటించాయి. భారత్ కూడా జాతీయ ఏఐ మిషన్, స్టార్టప్ మద్దతు, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా ఈ రేసులో వేగం పెంచుతోంది. భారత్ దూకుడు ఇదే విధంగా కొనసాగితే రానున్న సంవత్సరాల్లో ఏఐలో మరింత పైస్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే… ఏఐ రేసులో భారత్ ఇప్పుడు ఫాలోవర్ కాదు, ఫ్రంట్‌రన్నర్‌గా మారుతోంది.


