అమెరికా నుంచి వచ్చి ఓటు వేసిన మామ
ఒక్క ఓటు తేడాతో గెలిచిన కోడలు
కాకతీయ, నిర్మల్ : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితం వెలువడింది. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన ముత్యాల శ్రీవేద కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువ ఎంత కీలకమో ఈ ఫలితం మరోసారి రుజువు చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శ్రీవేద పోటీ చేస్తున్న విషయం తెలుసుకున్న ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్‌రెడ్డి అమెరికాలో నివాసం ఉంటున్నప్పటికీ, ఎన్నికలకు నాలుగు రోజుల ముందే స్వగ్రామానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించారు. చివరకు ఆ ఒక్క ఓటే ఫలితాన్ని మార్చిందన్న విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో మొత్తం 426 ఓట్లు ఉండగా, పోలైన ఓట్లు : 378, ముత్యాల శ్రీవేద : 189, హర్షస్వాతి : 188, చెల్లని ఓట్లు : 1గా నమోదయ్యాయి. హర్షస్వాతి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించడంతో ఆమె మద్దతుదారుల సంతోషానికి అంతేలేకుండా పోయింది. మరోవైపు ఓటు హక్కు ప్రాధాన్యతపై ఈ సంఘటన అందరికీ గుర్తుండిపోయే ఉదాహరణగా నిలిచిందని గ్రామస్తులు పేర్కొన్నారు.


