రామప్పలో యునెస్కో భారత రాయబారి
ఆలయ పరిరక్షణ చర్యలను పరిశీలించిన విశాల్ వి. శర్మ
కాకతీయ, ములుగు ప్రతినిధి : యునెస్కోకు భారత రాయబారి మరియు శాశ్వత ప్రతినిధి విశాల్ వి. శర్మ ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశం రుద్రేశ్వర (రామప్ప) ఆలయాన్ని సందర్శించారు. పారిస్ నుంచి భారత్‌కు వచ్చిన అనంతరం ఆయన ఆలయాన్ని దర్శించి, భారత పురావస్తు సర్వే సంస్థ (ఏఎస్‌ఐ) మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ, పరిరక్షణ చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ శిల్పకళ, నిర్మాణ విశిష్టత, శతాబ్దాల నాటి వారసత్వాన్ని కాపాడేందుకు చేపడుతున్న పనులపై అధికారుల నుంచి సమగ్ర వివరాలను రాయబారి శర్మ తెలుసుకున్నారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన అనంతరం రామప్ప ఆలయంలో చేపట్టిన అభివృద్ధి, నిర్వహణ విధానాలను ఆయన ప్రశంసించారు. యునెస్కో 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న విశాల్ వి. శర్మ, ఈ బాధ్యతను నిర్వహించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. అదేవిధంగా ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్‌గార్డింగ్ ది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ 20వ సెషన్‌కు కూడా ఆయన అధ్యక్షత వహించారు. ఆ సమావేశంలో దీపావళి పండుగ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేరడం విశేషంగా నిలిచింది. ఈ పర్యటనలో ఏఎస్‌ఐ డైరెక్టర్ డాక్టర్ హెచ్.ఆర్. దేశాయ్, డిప్యూటీ సూపరింటెండెంట్ కృష్ణ చైతన్య, డిప్యూటీ ఆర్కియాలజికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రోహిణి పాండే అంబేకర్, గోల్కొండ ఫోర్ట్ ఇంచార్జ్ ఎం. మల్లేష్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ శ్రీ నాగోజీ రావు తదితరులు పాల్గొన్నారు.


