దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది
క్రమశిక్షణ, కఠిన శ్రమతో ఏ రంగంలోనైనా విజయం సాధ్యం
వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
కాకతీయ, హనుమకొండ : దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని వరంగల్ పార్లమెంట్ సభ్యులు డా. కడియం కావ్య అన్నారు. విద్యే విద్యార్థుల జీవితాన్ని మలిచే ప్రధాన ఆయుధమని స్పష్టం చేశారు. హనుమకొండ పెద్దపెండ్యాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన ‘ఆరోహన్–2025’ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించి స్పష్టమైన లక్ష్యాలను నిర్ధారించుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, కఠిన శ్రమ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు వైఫల్యాలను భయపడకుండా వాటిని విజయానికి మెట్లుగా మలచుకోవాలని, చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కెరీర్ ఎంపికలో ఇతరుల ఒత్తిడికి లోనుకాకుండా తమ ఇష్టాలు, సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. లక్ష్యం స్పష్టంగా ఉంటే భవిష్యత్తులో తప్పకుండా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరైన దిశానిర్దేశం చేయడంలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, ఇలాంటి కార్యక్రమాలను పాఠశాలల్లో నిరంతరం నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఎంపీ సర్టిఫికెట్లు, మెమెంటోలను అందజేశారు. అనంతరం విద్యార్థులతో మమేకమై వారిని ఆప్యాయంగా పలకరించారు.
ఈ కార్యక్రమంలో నిట్ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాదర్ సుబుద్ధి, డీపీఎస్ డైరెక్టర్ రాజి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, వైస్ చైర్మన్ రవి కిరణ్ రెడ్డి, ప్రిన్సిపల్ ఇన్నా రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


