అదనపు కట్నం కోసం కోడలిని హత్య
ఆత్మహత్యగా చిత్రీకరించి పరారీ
కొమ్ముగూడెంలో దారుణం
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామంలో అదనపు కట్నం కోసం కోడలిని హత్య చేసిన దారుణ ఘటన కలకలం రేపింది. కోడలు స్వప్నను అత్తింటివారు అతి కిరాతకంగా కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించి పరారైనట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. స్వప్నను కొంతకాలంగా అదనపు కట్నం కోసం అత్త, మామ, భర్త, మరిది వేధింపులకు గురిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమెను తీవ్రంగా కొట్టి హత్య చేసి, ఆత్మహత్యగా చూపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు, తండావాసులు మృతురాలి ఇంటి వద్దకు చేరుకుని ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. స్వప్నను హత్య చేసిన అత్త, మామ, భర్త, మరిదిలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు స్వప్నకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్నారుల భవితవ్యంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు


