ఖిలావరంగల్ కోటలో విద్యార్థుల సందడి
కాకతీయ, ఖిలావరంగల్ : పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఖిలావరంగల్ మధ్యకోట ఆదివారం సందడిగా మారింది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మధ్యకోటలోని శిల్పాల ఆవరణ, కీర్తి తోరణాలు, గుండుచెరువు, ఏకశీల గుట్ట, ఖుష్ మహల్, సింగారుపు బావి, రాతికోట, మట్టికోట, ఏకశీల పిల్లల పార్క్‌లను పర్యాటకులు ఆసక్తిగా పరిశీలించారు. కాకతీయుల కాలం నాటి దేవాలయాల చరిత్ర, శిల్ప కళా వైభవం గురించి విద్యార్థులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుండే సాయంత్రం వరకు సందర్శకుల రాకతో మధ్యకోట ప్రాంతం కళకళలాడింది. పర్యాటకులు తమ అనుభూతులను సెల్‌ఫోన్లలో ఫొటోలను బంధించారు.


