బీజేపీ కొత్త జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్
కాకతీయ, నేషనల్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిహార్‌కు చెందిన సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి నితిన్ నబీన్‌ను నియమించింది. ఈ మేరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపింది. సంస్థాగత వ్యవహారాలపై పట్టు, రాజకీయ అనుభవం కలిగిన నబీన్‌కు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. నితిన్ నబీన్ ప్రస్తుతం బిహార్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన పట్నాలోని బంకిపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు (కొన్ని నివేదికల ప్రకారం ఐదు సార్లు) శాసనసభ్యునిగా గెలుపొందారు.
అప్పగించిన బాధ్యతలు
నితిన్ నబీన్ నియామకంతో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపడం వంటి కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ఇటీవల ముగిసిన నేపథ్యంలో ఈ కొత్త నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నితిన్ నబీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


