హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ప్రజలు మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు
: మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ, హన్మకొండ : సాధారణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. ఆదివారం నియోజకవర్గంలోని దామెర మండలం ఊరుగొండ గ్రామంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మరోసారి ప్రజలు మోసపోయి గోస పడొద్దని సూచించారు. బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.


