కొండాకు ఝలక్
దూరమవుతున్న అనుచరులు..!
అత్యంత సన్నిహితుడైన నల్గొండ రమేష్ సారయ్య వర్గంలోకి
జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామం
కార్యకర్తలను అక్కున చేర్చుకుంటున్న ఎమ్మెల్సీ
పెరుగుతున్న సంఖ్యాబలం.. అసమ్మతి నేతలంతా ఒక్కచోటకు
వరంగల్ తూర్పులో మారుతున్న రాజకీయ సమీకరణం
వరంగల్ నగర కాంగ్రెస్ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. మంత్రి అధికారాన్ని లెక్కచేయకుండా ద్వితీయ శ్రేణి, సీనియర్ నాయకులు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శిబిరానికి ఒక్కొక్కరిగా చేరుతున్నారు. కొండా దంపతుల ‘కుడి భుజం’గా పేరున్న నల్గొండ రమేష్ సారయ్య వర్గంలోకి వెళ్లడంతో వరంగల్ తూర్పులో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది.
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగర కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి అధికారాన్ని సైతం లెక్కచేయకుండా, పార్టీ మనుగడ, కార్యకర్తల రక్షణే ధ్యేయంగా ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కొక్కరుగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శిబిరానికి చేరుతున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలకు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నా, కార్యకర్తలకు న్యాయం జరగడం లేదనే భావనతో, మంత్రి వర్గాన్ని దూరంగా పెట్టి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే, కష్టాల్లో తోడుండే నాయకత్వం కావాలన్న ఆశయంతో నాయకులు సారయ్య చెంతకు చేరుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం.

కొండాకు నల్గొండ దూరం.. సారయ్య వర్గంలోకి రమేష్..!
గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కొండా సురేఖ గెలుపునకు కీలకంగా వ్యవహరించిన నల్గొండ రమేష్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శిబిరంలో చేరడం వరంగల్ తూర్పు కాంగ్రెస్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ చేరికతో సారయ్య వర్గానికి భారీ బలం చేకూరిందని కార్యకర్తలు భావిస్తున్నారు. రమేష్ చేరిక అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ ఒక్కొక్కరిగా సారయ్య వైపు మళ్లుతోందన్న చర్చ మొదలైంది. ఇది మంత్రి సురేఖ వర్గానికి గట్టి ఎదురుదెబ్బగా కూడా అభివర్ణిస్తున్నారు.
గెలిపించిన కార్యకర్తలను పక్కనపెట్టి, గతంలో బీఆర్ఎస్‌లో ఉండి ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లోకి వచ్చినవారికి ప్రాధాన్యత ఇవ్వడం, మరో ముఖ్య నాయకుడికి పార్టీ మొత్తం బాధ్యతలు అప్పగించడం తమలాంటి సీనియర్ నాయకులను అవమానపరిచినట్టేనని ఇటీవల కాంగ్రెస్ నేతల అంతర్గత సమావేశంలో నల్గొండ రమేష్ వ్యాఖ్యనించినట్లుగా తెలుస్తోంది. పరోక్షంగా కొండా దంపతుల ప్రధాన అనుచరుడిగా ప్రచారంలో ఉన్న నవీన్‌రాజ్‌ను ఉద్దేశించే రమేష్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్నది ప్రధాన చర్చగా ఉంది. రమేష్ కంటే ముందే కొంతమంది గతంలో కొండా మురళితో కలిసి పనిచేసిన వారిలో ఇప్పుడు సారయ్య వద్ద ప్రత్యక్షమవుతుండటం గమనార్హం. కొండా దంపతుల వ్యవహార శైలిపై అసంతృప్తితో, సారయ్య అనుభవాన్ని, నాయకత్వాన్ని గుర్తించి శిబిరం మార్చుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు రెండు వర్గాల మధ్య పోటీని మరింత ఉధృతం చేస్తున్నాయి.



