ఒట్టేయుండ్రి ఓటేశిండ్రా..
లేకపోతే నా పైసలు నాకివ్వండి
నల్గొండ జిల్లాలో దేవుడి ఫొటోతో ఇంటింటికీ తిరుగుతున్న ఓడిన అభ్యర్థి
మహబూబాబాద్ జిల్లాలోనూ సేమ్ సీన్
ఎన్నికల ఫలితాల అనంతరం పలు గ్రామాల్లో చిత్రవిచిత్రాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం పలు గ్రామాల్లో చిత్రవిచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల్లో గెలుస్తామనే ఆశతో.. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కొందరు అభ్యర్థులు మాత్రం ఓడిపోయారు. దీంతో ఓటమిపాలైన అభ్యర్థులు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. చివరకు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులను తమకు తిరిగి ఇచ్చేయాలంటూ ప్రాధేయపడుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోగా.. దేవుడి ఫోటోతో ఇంటింటికీ తిరుగుతూ తన డబ్బులు ఇవ్వాలని కోరుతున్నాడు. నార్కట్పల్లి మండలం ఔరవాణిలో బీఆర్‌ఎస్ మద్దతుదారుడు బాలరాజు మొదటి విడత ఎన్నికల్లో ఓట్ల కోసం రూ.10 లక్షలకుపైగా ఖర్చు చేశాడు. తీరా ఫలితాల్లో 448 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి దేవుడి ఫొటో, పురుగుమందుల డబ్బు చేత పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అభ్యర్థించారు. డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఓట్లు వేశామని చెబుతుండటంతో అయితే ఎలా ఓడిపోయాను అంటూ ఓటర్లను నిలదీశాడు. దేవుడిపై ప్రమాణం చేసి ఓటు వేశారో లేదో చెప్పాలని ఓటు వేయకపోతే తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఔరవాణి గ్రామ పంచాయతీలో మొత్తం 1577 ఓట్లు ఉండగా, 1494 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ బలపర్చిన పరమేశ్ 448 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. దీంతో ఓటమిపాలైన అభ్యర్థి బాలరాజు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు.
మహబూబాబాద్ జిల్లాలోనూ..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి కుటుంబ సభ్యులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మీరు మాకు ఓటు వేయకపోవడంతోనే మేము ఓడిపోయాం. మాకు ఓటు వేస్తే ఓటు వేసినట్లు ప్రమాణం చేయాలి. ఓటు వేయని పక్షంలో మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి అంటూ ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేసిన డబ్బులను తిరిగి వసూలు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో చోటు చేసుకుంది. ఎన్నికలకు ముందు రోజు తండాలోని ఓటర్లకు ఓటుకు రూ.1500 చొప్పున, ఇంటికి ఒక కోడిని కాంగ్రెస్ మద్దతుదారు పంచారు. కాంగ్రెస్ రెబల్ రూ.2000 పంపిణీ చేశారు. ఎన్నికల్లో 17 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఇస్లావత్ సుజాత బాలాజీ గెలుపొందారు. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా కౌసల్య, భర్త ధల్ సింగ్, కుమారుడు సందీప్ జెండా పట్టుకొని ఇంటింటికీ తిరుగుతూ మీరు ఓటు వేయకపోవడం వల్లనే మేం ఓడిపోయాం. మాకు ఓటు వేసినట్లు కులదైవం జెండా పట్టుకొని ప్రమాణం చేయండి. ప్రమాణం చేయని పక్షంలో మేం పంపిణీ చేసిన డబ్బులు మాకు ఇవ్వండి అంటూ తిరిగి డబ్బులు వసూలు చేశారు. ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టడం గమనార్హం.


