సర్పంచులను గెలిపించండి
గ్రామాల అభివృద్ధికి నిధులు తెస్తా
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్
వీణవంక మండలంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం
కాకతీయ, జమ్మికుంట(వీణవంక) : వీణవంక మండలంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున నాయకులు గ్రామగ్రామాన ప్రచారం నిర్వహిస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్ శనివారం బేతిగల్, కనపర్తి, వల్భాపూర్, నర్సింగాపూర్, కిష్టంపేట, గంగారం, చల్లూరు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామసభల్లో ప్రణవ్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీలు సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే నిధులు వరదలా వస్తాయని తెలిపారు. గతంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నర్సింగాపూర్, వీణవంక రోడ్డు పనులు పూర్తి చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఆ పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. తాను ఓడినా, గెలిచినా ప్రజల పక్షానే ఉంటానని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సేవ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ డైరెక్టర్లు, గ్రామశాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


