పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
:కలెక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ సిటీ : రెండో విడతలో ఆదివారం నిర్వహించునున్న గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సత్య శారద ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు-2025 లో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గీసుకొండ మండలంలోని గీసుగొండ జెడ్పిహెచ్ఎస్, సంగెం మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్, దుగ్గొండి మాండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలల్లో నల్లబెల్లి మండలంలోని సుమంగళీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ప్రతి కౌంటర్ ను కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు.
రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. పోలింగ్ సిబ్బంది చెక్ లిస్ట్ ప్రకారం తమకు అందజేసే సామాగ్రిని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, అదనపు సామాగ్రి ఆర్.ఓ జోనల్ అధికారుల వద్ద ఉంటుందని అవసరమైన వారు ఆయా అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఫామ్ 9 ప్రకారం సిబ్బంది తప్పనిసరిగా బ్యాలెట్ బాక్స్ చెక్ చేసుకోవాలని , పోలింగ్ , కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం అందించిన సామాగ్రిని జాగ్రత్తగా సీల్ చేసి డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు. సిబ్బందికి సందేహాలు ఉంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేశామని వాటి ద్వారా సందేహాలను నివృత్తి చేసుకొని ఎలాంటి పొరపాట్లు లేకుండా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పి సీఈఓ రాం రెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, ఎం పి డి ఓ లు, తహసీల్దార్లు, ఇతర ఎన్నికల సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.


