ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 14న జరగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. శనివారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన ఎన్నికల బందోబస్తు వివరాలను వెల్లడించారు.
కమిషనరేట్ పరిధిలోని చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం మండలాల్లో రెండవ విడత పోలింగ్ జరగనుందని తెలిపారు. ఈ పరిధిలో 113 గ్రామ పంచాయతీలకు సంబంధించి మొత్తం 1,046 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గత సంఘటనలను దృష్టిలో పెట్టుకుని సున్నితమైన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో స్టాటిక్ పోలీసు పార్టీతో పాటు ప్రతి రూట్‌కు రూట్ మొబైల్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రతి మండలానికి ఒక ఏసీపీ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించి వారి ఆధీనంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను కేటాయించినట్లు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు ప్రచారం, గుంపులుగా చేరడం, పార్టీ చిహ్నాల ప్రదర్శన పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, ప్రచార సామగ్రికి అనుమతి ఉండదన్నారు. ఈ విడత ఎన్నికల బందోబస్తుకు మొత్తం 852 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఇందులో ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, హోంగార్డులు, బెటాలియన్ స్పెషల్ పోలీసులు ఉన్నారని అదనంగా ఎన్‌సీసీ సభ్యులను కూడా వినియోగిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్స్‌లను రిసీవింగ్ సెంటర్లకు కట్టుదిట్టమైన భద్రతల మధ్య తరలిస్తామని ఎన్నికల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడానికి ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసులకు సహకరించాలని సీపీ గౌస్ ఆలం కోరారు.



