ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో రెండో విడతగా నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు 2025లో భాగంగా ఈ నెల 14న రెండవ విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తిమ్మాపూర్ మండలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో మానకొండూర్ మండలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ శనివారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి కౌంటర్‌ను తనిఖీ చేసి ఎన్నికల సామాగ్రిని చెక్‌లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని పోలింగ్ సిబ్బందికి సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి నివేదికలు పంపించాలని అధికారులను ఆదేశించారు. రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.


