డంపింగ్ యార్డు తరలించాలి
విష వాయువులతో చచ్చిపోతున్నాం
కోతిరాంపూర్ డంప్‌యార్డులో స్థానికుల నిరసన
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ బైపాస్ వద్ద ఉన్న డంప్‌యార్డ్ నుంచి గత కొన్ని రోజులుగా నిరంతరం వెలువడుతున్న విషవాయువులు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భరించలేని దుర్వాసనతో పాటు శ్వాసకోశ సమస్యలు, తలనొప్పులు వంటి ఆరోగ్య ఇబ్బందులు పెరుగుతున్నాయని ఈ పరిస్థితిపై స్పందించాలని డిమాండ్ చేస్తూ దుంపేటి రాము, ఉమర్ అన్సారీ, రాజు, శ్రీనివాస్‌లు డంప్‌యార్డ్ ఎదుట ప్లైకార్డులతో శాంతియుత నిరసన చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రజలు రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిరసనకారులు హెచ్చరించారు. డంప్‌యార్డ్ నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ విషవాయువుల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.


