శాంతియుత ఎన్నికల నిర్వహణే ప్రధాన లక్ష్యం
మహబూబాబాద్ ఎస్పీ శబరీష్
కాకతీయ, మహబూబాబాద్ : జిల్లాలో నిర్వహించనున్న రెండవ విడత పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టామని జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు. రెండవ విడత పంచాయతీ ఎన్నికల కోసం 5 డిఎస్పీలు, 17 సీఐలు, 50 ఎస్.ఐలు మొత్తం 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి గ్రామంలో పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాల మొహరించయని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను, సిబ్బందికి ప్రత్యేక దిశానిర్దేశాలు జారీ చేశారు. ప్రతి గ్రామంలో శాంతిభద్రతలు క్షుణ్ణంగా పర్యవేక్షించేలా పోలీస్ బలగాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను క్రిటికల్, సాధారణ, అత్యంత సున్నిత ప్రాంతాలుగా వర్గీకరించి, పరిస్థితిని బట్టి అదనపు పోలీస్ బలగాలను మోహరించినట్లు వివరించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తావు ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పండుగ అయిన ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు.


