చైనా ఆధిపత్యానికి అమెరికా బ్రేక్ ప్లాన్.. బట్ భారత్‌కు నో ఎంట్రీ!
సిలికాన్ వ్యూహంలో అమెరికా ముందడుగు
ప్యాక్స్ సిలికాలో భారత్ కు దక్కని చోటు
మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్
కాకతీయ, నేషనల్ డెస్క్ : కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ శక్తిసమీకరణ వేగంగా మారుతోంది. ముఖ్యంగా సిలికాన్ ఆధారిత హైటెక్ సరఫరా గొలుసులపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యానికి బ్రేక్ వేయాలనే లక్ష్యంతో అమెరికా కీలక అడుగు వేసింది. అదే ‘ప్యాక్స్ సిలికా’. అమెరికా విదేశాంగ శాఖ ప్రారంభించిన ఈ కొత్త ప్రోగ్రామ్ ఏఐ భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నప్పటికీ, ఇందులో భారత్‌కు చోటు దక్కకపోవడం రాజకీయంగా, వ్యూహాత్మకంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ కార్యక్రమంలో జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, నెదర్లాండ్స్, యూకే, ఇజ్రాయెల్, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి టెక్నాలజీ శక్తివంతమైన దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. సిలికాన్, సెమీకండక్టర్ సరఫరా విషయంలో ఒకే దేశంపై, ముఖ్యంగా చైనాపై ఆధారపడకుండా ఉండటమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. ఏఐ పరికరాలు, చిప్‌లు, అత్యాధునిక టెక్నాలజీల అభివృద్ధిని భద్రపరచడం కూడా ఈ ప్రోగ్రామ్ లక్ష్యాల్లో కీలకం.
అయితే, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న టెక్ మార్కెట్‌లలో ఒకటైన భారత్‌కు ఈ కీలక కూటమిలో ఎంట్రీ లభించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదే అంశాన్ని కేంద్రంగా చేసుకుని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలనే అమెరికా ప్రయత్నాల్లో భారత్ సహజ భాగస్వామి కావాల్సిందని, కానీ అది జరగకపోవడం భారత విదేశాంగ వైఫల్యమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ–డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాల్లో ఏర్పడిన అపార్థాలే ఇందుకు కారణమై ఉండవచ్చని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది.
మరోవైపు, అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ ప్రోగ్రామ్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పింది. సిలికాన్ సరఫరా విషయంలో బలవంతపు ఆధారపడకూడదనే లక్ష్యంతోనే ‘ప్యాక్స్ సిలికా’ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఏఐకు సంబంధించిన సామర్థ్యాలను రక్షించడం, ఆధునిక సాంకేతికతల అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ కూటమి ప్రధాన ఎజెండా అని పేర్కొంది.
ఇదిలా ఉండగా, భారత్ ఏఐ రంగంలో వెనుకబడి లేదన్న వాదనను కేంద్ర ప్రభుత్వం ముందుకు తెస్తోంది. వచ్చే ఏడాది భారత్‌లో ‘ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026’ నిర్వహించనున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిర్వహించబడుతున్న తొలి ఏఐ సదస్సు ఇదే కావడం విశేషం. అయితే, గ్లోబల్ ఏఐ కూటములు ఒకవైపు, భారత్ స్వతంత్ర ప్రయత్నాలు మరోవైపు సాగుతుండటం భవిష్యత్తులో ఏ మేరకు ఫలితాలు ఇస్తాయన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ.


