ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మిడ్ డే మిల్స్ ఏర్పాటు చేయాలి
జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలోని పేద విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు ఉత్తీర్ణశాతం పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనం బాటలో భాగంగా అంబర్ పేట నియోజకవర్గంలోని కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం ఆమె సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి కళాశాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను కళాశాల రప్పించడంలో చదివించడంలో అధ్యాపకులు బాధ్యతగా పనిచేస్తున్నారని ఆమె చెప్పారు. విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడి దాదాపు 60 సంవత్సరాలు అయినా చిన్న చిన్నగా మరమ్మతులు చేశారు తప్ప భవనానికి రంగులు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఒకే సముదాయంలో ప్రైమరీ స్కూల్, ప్రైమరీ స్కూల్ బాలికల హాస్టల్, హై స్కూల్ పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీ నడుస్తున్నాయని నూతనంగా భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించారు.


