కాలుష్యంపై ప్రత్యేక ప్లాన్ అవసరం
లేకుంటే ప్రమాదంలో కోట్లాది మంది
దేశంలో పెరిగిపోతున్న క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు
ఇది జాతీయ ఆరోగ్య సంక్షోభం
ఈ అంశంపై ప్రభుత్వం- ప్రతిపక్షం కలిసి చర్చించాలి
వ్యవస్థాత్మక ప్రణాళిక రూపొందించాలి
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
కాకతీయ, నేషనల్ డెస్క్: దేశంలోని ప్రధాన నగరాలన్నీ విషపూరిత గాలితో కమ్ముకున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ సమస్య రాజకీయాలకతీతమైందని, ప్రభుత్వం- ప్రతిపక్షం కలిసి చర్చించి ఒక వ్యవస్థాత్మక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభలో శుక్రవారం రాహుల్‌గాంధీ మాట్లాడారు. దేశంలోని చాలా పెద్ద నగరాలు ప్రాణాంతక గాలిముసుగులో జీవిస్తున్నాయి. కోట్లాది పిల్లలకు ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. వారి భవిష్యత్తు నాశనం అవుతోంది. వేలాది మంది క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఇది రాజకీయాల అంశం కాదు. అధికారపక్షం- ప్రతిపక్షం అందరూ ఏకాభిప్రాయం కాగలిగే విషయం ఇది అని అన్నారు.
దేశానికి ఉపయోగపడే చర్చ జరగాలి
దేశంలో పెరుగుతున్న కాలుష్యంపై చర్చ నిర్వహించి, ప్రతి మెట్రో నగరానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రధాని ముందుకు రావాలని రాహుల్ సూచించారు. ఒకరినొకరు విమర్శించుకునే చర్చలు కాకుండా, దేశానికి ఉపయోగపడే చర్చ జరగాలి. వచ్చే ఐదేళ్లలో అయినా, పది సంవత్సరాల్లో అయినా, కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోయినా కనీసం సమస్య తగ్గించే దిశగా ప్రభుత్వం ఒక పద్ధతిగల ప్రణాళికను తీసుకురావాలి అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కాలుష్యం నిరంతరం పెరుగుతున్నందున, ఒక్కో నగరానికి విడి ప్రణాళిక అవసరమని చెప్పారు. ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోందని, ఇది జాతీయ ఆరోగ్య సంక్షోభమని రాహుల్ హెచ్చరించారు.
చర్చకు సిద్ధమేననన్న కిరణ్ రిజిజు
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రభుత్వం చర్చకు పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. “ప్రాధాన్యం గల అన్ని అంశాలపై చర్చించేందుకు మేం మొదటి రోజు నుంచే సిద్ధం. సభ్యులందరి సూచనలను వినడానికి, వాటిని తీసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. నియమాలు, నిబంధనల ప్రకారం ఈ చర్చను ఎలా తీసుకెళ్లాలన్నదాన్ని పరిశీలిస్తాం” అని రిజిజు చెప్పారు.


