మేడారం దారిలో ఎస్పీ రామనాథ్
ట్రాఫిక్ జాం అయ్యే ప్రదేశాల పరిశీలన
సేఫ్ జోన్‌లు, ట్రాఫిక్ డైవర్షన్, ప్రమాదకర మలుపులపై ఆరా
కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్బంగా జిల్లాకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ట్రాఫిక్ నిర్వహణను పటిష్ఠంగా చేపట్టడం కోసం ములుగు జిల్లా ఎస్ పి కేకాన్ సుధీర్ రామనాథ్ శుక్రవారం వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఎస్ పి ముందుగా మహావీర్ పార్కింగ్ నుండి గోనెపల్లి–వెంగలాపూర్ రూట్ ను పరిశీలించారు. ఈ రహదారిలో రహదారి వెడల్పు, ప్రమాదకర మలుపులు, భక్తుల రాకపోకలకు అనుకూలమైన సేఫ్ జోన్‌లు, ట్రాఫిక్ డైవర్షన్‌కు వీలైన ప్రాంతాల వంటి అంశాలను వివరంగా ఆరాతీశారు. భక్తుల రద్దీ ఒకేసారి అధికమయ్యే పరిస్థితుల్లో ఈ రూట్‌ను ప్రత్యామ్నాయ ప్రధాన మార్గంగా వినియోగించే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలించారు. ఈ రూట్‌లో ఉన్న చిన్న అడ్డంకులు,ఎత్తువంపులు,చీకటి ప్రాంతాలు వెంటనే తొలగించాలనీ, అవసరమైన లైటింగ్ ఏర్పాట్లు చేపట్టాలని ఎస్‌పి ఆదేశించారు.ఎస్‌పి సుధీర్ రామనాధ్ మాట్లాడుతూ జాతర సమయంలో ట్రాఫిక్ జామ్‌లు కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యవసరం అని,రద్దీ పెరిగిన సందర్భంలో ఈ ప్రత్యామ్నాయ మార్గాలు కీలక పాత్ర పోషిస్తాయి అని పేర్కొన్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మరిన్ని డైవర్షన్ రూట్లు కూడా సిద్ధం చేస్తున్నామని అన్నారు. అన్ని ప్రత్యామ్నాయ మార్గాలలో స్పష్టమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి అని, రాత్రి వేళల్లో కనపడేలా రేడియం స్టికర్లు అమర్చాలి అని, కీలక పాయింట్ల వద్ద పోలీస్ పికెట్స్, సిగ్నలింగ్ టీమ్స్ ఏర్పాటు చేయాలి అని, ప్రమాదకర ప్రాంతాలను వెంటనే భద్రపరచాలి అని, జాతర రోజుల్లో భారీ వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతి రూట్‌పై బలమైన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో డీఎస్పీ ములుగు రవీందర్,
సీఐ పస్రా దయాకర్, ఎస్‌ఐలతో సహా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


