కాకతీయ, వరంగల్ సిటీ: వరంగల్ జిల్లా కేంద్రంలోని ఖిలా వరంగల్ మైదానంలో శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైందని, మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు.గడిచిన పది ఏళ్ల లో గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు జారీ చేయలేదన్నారు.
మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ఎన్ని సమస్యలు వున్నా అదిగమిస్తూ ఒక్కొక్కటిగా పేదలకు ప్రభుత్వం పథకాలను అందిస్తున్నామన్నారు. కోటి మందిని కోటీశ్వరులు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీఠ వేసిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేశామన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలలలోనే 7లక్షల కొత్త రేషన్ కార్డులను అందించామన్నారు.
ఈ వేడుకల్లో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, శాసనమండలి సభ్యులు బస్వారాజు సారయ్య, శాసనసభ్యులు కె ఆర్ నాగరాజ్, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది స్వాతంత్ర సమరయోధులు ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


