డీకే డిన్నర్ పాలిటిక్స్..!
రాత్రివేళ 30 మంది ఎమ్మెల్యేలతో రాజకీయ చర్చలు
కర్ణాటకలో హీటు పెంచిన ఉపముఖ్యమంత్రి భేటీలు
స్నేహపూర్వక సమావేశం మాత్రమే అంటూ వ్యాఖ్య
కాకతీయ, నేషనల్ డెస్క్ : కర్ణాటకలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి సీటు కోసం నిన్న మొన్నటి వరకు ఢిల్లీ వేదికగా నువ్వా-నేనా అన్నట్టు తలపడ్డ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్… ఇటీవల బెంగళూరులో ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి బ్రేక్‌ఫాస్ట్‌లు చేశారు. ప్లేట్లలో ఇడ్లీ, వడ, దోశెలతో పాటు రాజకీయ వ్యూహాలను కూడా పంచుకున్నారు. ఇలాంటి తరుణంలో డీకే శివకుమార్ వేసిన కీలక అడుగు కర్ణాటకలో పొలిటికల్ హీటును మరింత పెంచేసింది. తాజాగా డీకే విందుతో కూడిన రాజకీయ సమీకరణాలకు వేదికయ్యారు.
గురువారం రాత్రి, డీకే శివకుమార్ 30 మంది పైగా ఎమ్మెల్యేలతో డిన్నర్ నిర్వహించారు. ఇందులో కొంతమంది మంత్రులు, అలాగే భాజపా నుంచి బహిష్కరణ పొందిన ఎమ్మెల్యేలు ఎస్.టి. సోమశేఖర్, శివరామ్ హెబ్బర్ కూడా పాల్గొన్నారు. ఈ డిన్నర్ ప్రత్యేకంగా కాంగ్రెస్ నేత ప్రవీణ్ ఫామ్‌హౌస్‌లో జరిగింది. డీకే శివకుమార్ నేతృత్వంలో జరిగిన ఈ రాజకీయ విందు సాధారణమేని నేతలు చెబుతున్నప్పటికీ, విశ్లేషకులు మాత్రం దీనిని ముఖ్యమంత్రి మార్పు పై దిశ చూపించే శక్తి ప్రదర్శనగా అభిప్రాయపడుతున్నారు. అయితే డీకే శివకుమార్ ఈ డిన్నర్ గురించి మాట్లాడుతూ.. “ఒక ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన విందులో పాల్గొన్నాం అంతే. ప్రత్యేకతగా చెప్పుకోదగినది ఏమీ లేదు. ఇది కేవలం స్నేహపూర్వక సమావేశం మాత్రమే.” అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం కొద్దిమంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలతో ముందురోజు ఇలాంటి విందులో పాల్గొన్నారు. ఆ ఆతిథ్య బాధ్యతలను బెళగావి నార్త్ ఎమ్మెల్యే ఫిరోజ్ నిర్వహించినట్లు సమాచారం. కాగా, ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాల మధ్య, ఈ డిన్నర్ శక్తి ప్రదర్శనగా భావిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు, ఇలా జరిగే విందులు ఇప్పుడు పవర్ ముచ్చట్లుగా మారాయి.


