చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు.. ఉక్రెయిన్ స్ట్రాటజీకి రష్యా షాక్
కాస్పియన్ సముద్రంలో ఉద్రిక్తతలు
రష్యా చమురు క్షేత్రాలే టార్గెట్ గా ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
యూరప్ నుంచి భారీ మద్దతు
కాకతీయ, నేషనల్ డెస్క్ : రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాది దాటుతున్నా..రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మాత్రం ఒక్కరోజు కూడా తగ్గడం లేదు. శాంతి చర్చలు కొనసాగుతూనే ఉన్నప్పటికీ, భూమిపై మాత్రం మరింతగా అగ్ని రాజకీయాలు చెలరేగుతున్నాయి. తాజాగా కాస్పియన్ సముద్రంలోని రష్యా కీలక చమురు క్షేత్రాన్ని ఉక్రెయిన్ లాంగ్-రేంజ్ డ్రోన్లు టార్గెట్ చేయడంతో పరిస్థితి కొత్త మలుపు తిరిగింది.
ఉక్రెయిన్ సైనిక ఉన్నతాధికారి వెల్లడించిన వివరాల ప్రకారం… రష్యా యుద్ధానికి ముఖ్యమైన ఆదాయ వనరు అయిన చమురు ఎగుమతులను దెబ్బతీయడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశం. చమురు రిజర్వాయర్లను లక్ష్యంగా చేసుకొని ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రోన్లను ప్రయోగించామని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. రష్యా ఆర్థిక బలం కాస్తా యుద్ధాన్ని మరింత దీర్ఘకాలం నెట్టేస్తోందని భావిస్తున్న కీవ్… ఇప్పుడు ఆయా వనరులపైనే దాడులు చేస్తూ స్ట్రాటజీ మార్చింది.
ఇది ఒక్క దాడితో ముగియదని కూడా ఉక్రెయిన్ సంకేతాలిచ్చింది. రష్యా చమురు క్షేత్రాలు, ఇంధన మౌలిక వసతులు, నిల్వ కేంద్రాలు తదితర ప్రాంతాలపై మరిన్ని ఆపరేషన్లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి దాడులు రష్యా ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాదు… యుద్ధ సామర్థ్యాన్ని కూడా బలహీనపరుస్తాయని ఉక్రెయిన్ నమ్ముతోంది. చమురు క్షేత్రాలు టార్గెట్ కావడం రష్యాకు పెద్ద షాక్‌గా మారింది.
ఇకపోతే ఉక్రెయిన్ ఆర్మీకి ప్రస్తుతం యూరప్ దేశాల నుంచి భారీ సైనిక సహాయం అందుతోంది. తేలికపాటి యుద్ధ ట్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థలు, యాంటీ-ట్యాంక్ మిసైల్స్, సూపర్-ప్రెసిషన్ ఆయుధాలను ఇప్పటికే ఇచ్చామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. రష్యా దాడులు కీవ్‌పై ఆగకపోవడంతో… మరింత సహాయాన్ని అందించాలని ఆయన యూరప్ నేతలను కోరుతున్నారు. ఉక్రెయిన్ ఆర్థిక పునర్నిర్మాణం, ఆయుధ సప్లై, భద్రతా ఒప్పందాలపై త్వరలో అమెరికాతో ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. యుద్ధం దీర్ఘకాలం సాగుతున్న నేపథ్యంలో, అమెరికా మద్దతు ఉక్రెయిన్‌కు కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదే సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలోనే సుమారు 25,000 మంది ప్రాణాలు కోల్పోయారని, శాంతి చర్చలు ఫలితం చూపకపోవడం తీవ్రంగా కలిచివేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా దాడులు, ప్రతిదాడులు కొనసాగితే… మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాన్ని తిరస్కరించలేమని ట్రంప్ హెచ్చరిస్తూ ప్రపంచ నాయకులు బాధ్యతాయుతంగానే వ్యవహరించాలని సూచించారు.


