ట్రంప్ మార్క్ షాక్..అమెరికాలో ప్రసవం ఇక కష్టమే!
బర్త్ టూరిజం ట్రెండ్‌కు అమెరికా ఫుల్స్టాప్
వీసా అప్లికేషన్లపై కఠిన పరిశీలన
పౌరసత్వం కోసం ముగిసిన షార్ట్‌కట్
కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికాలో పుట్టిన బిడ్డకు అక్కడి పౌరసత్వం లభించడం అనేది ఎన్నో భారతీయ కుటుంబాలు ఆశగా చూసే విషయం. ఈ ‘బర్త్ టూరిజం’ అనే పేరుతో కొందరు ప్రత్యేకంగా అమెరికాకు వెళ్లి ప్రసవం ప్లాన్ చేసుకునే ట్రెండ్ గత కొంతకాలంగా పెరిగింది. అయితే ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తూ అమెరికా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ట్రంప్ పాలనలో ప్రారంభమైన ఈ వైఖరి ఇప్పుడు మరింత కఠినంగా అమలు కాబోతుంది.
భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తాజాగా చేసిన ప్రకటనతో అనేక కుటుంబాలకు నిరాశ ఎదురైంది. కేవలం అమెరికాలో బిడ్డకు జన్మనివ్వాలి అన్న ఒక్క ఉద్దేశంతోనే వీసా కోసం అప్లై చేసే వారికి ఇక టూరిస్ట్ వీసాలు దొరకవని స్పష్టం చేసింది. వీసా ఇంటర్వ్యూలో ఈ ఉద్దేశం గమనించినా, చిన్న అనుమానం వచ్చినా, వెంటనే తిరస్కరిస్తామని ఎంబసీ స్పష్టంచేసింది.
అమెరికా చట్టాల ప్రకారం, భూభాగంపై పుట్టిన ప్రతి బిడ్డకు పౌరసత్వం లభిస్తుంది. ఈ లూప్‌హోల్‌ని ఉపయోగించుకునే వారి సంఖ్య పెరిగిపోవడంతో ప్రభుత్వం ముందు నుంచే ఆందోళన చెందుతోంది. ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన నియంత్రణ చర్యలు ఇప్పుడు మరింత స్పష్టతతో ఆచరణలోకి వస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల నిజమైన పర్యాటకులపై ఎలాంటి ప్రభావం ఉండదని ఎంబసీ చెబుతున్నా, బర్త్ టూరిజం ప్లాన్ చేస్తున్న కుటుంబాలకు మాత్రం ఇది పెద్ద దెబ్బ.
ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసేవారి ఉద్దేశ్యం, ట్రావెల్ హిస్టరీ, మెడికల్ డాక్యుమెంట్స్ అన్నీ కఠినంగా పరిశీలించబడతాయి. కేవలం ప్రసవం కోసమే అమెరికాకు వెళ్లాలని ప్రణాళిక రచించుకునే గర్భిణులకు టూరిస్ట్ వీసాలు నిరాకరించబడతాయని ఎంబసీ తాజాగా స్పష్టం చేసింది. మొత్తానికి ట్రంప్ మార్క్ షాక్‌తో అమెరికాలో ప్రసవం ద్వారా పౌరసత్వం పొందడం ఇక అంత ఈజీ కాదనే చెప్పాలి.


