నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు
ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎదురు చూపులు
జిల్లా, నియోజకవర్గ స్థాయి కమిటీల్లో చోటుకు పైరవీలు
ఇప్పటికే పలు వ్యవసాయ మార్కెట్లకు చైర్మన్ల నియామకం
మిగిలినవి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే నియామకం
ఆశలు రేపిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు
దిశ, వరంగల్ బ్యూరో : నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నేతల నిరీక్షణ కొనసాగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దగ్గర పడుతున్నా నామినేటెడ్ పదవుల నియామకంలో ఇంకా కొన్ని అవకాశాలను భర్తీ చేయలేదు. ముఖ్యంగా జిల్లా, నియోజకవర్గ స్థాయి, వ్యవసాయ, ఆలయాల చైర్మన్ల పదవులపై కన్నేసిన కొంతమంది నిర్విరామంగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే పార్టీలో సీనియర్లకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో పీసీసీ నేతలు ఉండటం, మంత్రివర్గం విస్తరణ తర్వాత నామినేటెడ్ పదవులపై నిర్ణయాలు తీసుకుంటామని ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నారు. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రతిష్ఠంబన కొనసాగుతోంది. ఏళ్లుగా పార్టీలో పనిచేశాం.. అయినా సరైన గుర్తింపు దక్కడం లేదన్న నైరాశ్యం కొంతమంది నేతల్లో కనిపిస్తుండటం గమనార్హం.
స్థానిక ఎన్నికల తర్వాత నియామకాలు..?!
త్వరలోనే స్థానిక సంస్థల పోరు పూర్తి కానుంది. దీని తర్వాత ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ పదవులపైనా చాలా మంది కన్నేశారు. ఇప్పటి నుంచే జోరుగా నమ్మకంతో నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో మిగిలిన వారికి ఇచ్చే చాన్స్ ఉందన్న చర్చా జరుగుతోంది. దీనికి తోడు పార్టీలో పదేళ్లకు పైబడి పనిచేసే వాళ్లకు ముందు ప్రియారిటీ ఇవ్వాలనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి నటరాజ్ మీనన్ తెలిపిన నేపథ్యంలో డీసీసీల వద్ద నుంచి నాయకుల జాబితాలు కూడా వెళ్లడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ కూడా నామినేటెడ్ పదవులను సీనియర్లకే అన్నట్లుగా సుస్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా సమర్థవంతమైన నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో ప్రదర్శించిన నేతలకే అవకాశాలు కనిపిస్తుండటం గమనార్హం.
నియోజకవర్గ, జిల్లా పదవులపై ఆశలు
వాస్తవానికి నామినేటెడ్ పదవుల్లో మార్కెట్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఆలయాల కమిటీలతో పాటు మరికొన్ని నియోజకర్గ, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులున్నాయి. ఇందులో మార్కెట్లు, ఆలయాల కమిటీ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ పదవులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశవహులకు లింక్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈనేపథ్యంలోనే అనేక ఆలయాలు, కొన్ని మార్కెట్ పాలక వర్గాల కమిటీలు ఉమ్మడి వరంగల్ లో పెండింగ్‌లో ఉండటం.. ఆ వాదనకు బలం చేకూర్చినట్లవుతోంది. అందుకే దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు పాలకవర్గాల్లో నియామకాల ప్రక్రియలో ఎలాంటి చలనం లేకుండా పోయింది. దీనంతటికీ మంత్రివర్గ కూర్పు లేకపోవడమే కారణమని తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ తర్వాతే నామినెటెడ్ పదవుల భర్తీ ఉంటుందనేది కీలక నేతలు చెబుతుండడంతో ద్వితీయ శ్రేణి నాయకులు అభిప్రాయంతో ఉండటం గమనార్హం.


