నమస్తే” కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి
: మేయర్ గుండు సుధారాణి
సెప్టిక్ ట్యాంక్ వర్కర్లకు “నమస్తే కార్యక్రమం”పై అవగాహన
కాకతీయ, వరంగల్ : డిస్లడ్జింగ్ ఆపరేటర్లు సెప్టిక్ ట్యాంక్ వర్కర్లు”నమస్తే (-నేషనల్ ఆక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఏకో సిస్టమ్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో బుధవారం డి స్లెడ్జింగ్ ఆపరేటర్లు సెప్టిక్ ట్యాంక్ వర్కర్లకు నమస్తే కార్యక్రమంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేయర్ పాల్గొని మాట్లాడుతూ మల వ్యర్ధాలు నిర్వహించే సిబ్బందికి నమస్తే కార్యక్రమం ఎంతో ఉపయుక్తమని అన్నారు. మాన్యువల్ పద్ధతికి పూర్తిగా చెక్ పెట్టి, డ్రైన్స్ నుంచి వ్యర్థాలను యంత్రాలతోనే తొలగించాలని. ఇది కార్మికుల భద్రతకు, పరిశుభ్రత ప్రమాణాలకు అత్యంత అవసరమని అన్నారు.
డీ-స్లడ్జింగ్ కార్యకలాపాలను సురక్షితంగా, ప్రమాణాలతో నిర్వహించేందుకు ఎంపానెల్ చేసిన ఏజెన్సీ ద్వారా ఆపరేటర్లకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. మరింత సమర్థంగా సేవలు అందించేందుకు ప్రతి ఆపరేటర్‌కు మూడు వార్డులను కేటాయించి, ప్రతి మూడు నెలలకు ఒకసారి సెప్టిక్ ట్యాంకుల డీ-స్లడ్జింగ్ తప్పనిసరిగా చేపట్టేలా షెడ్యూల్ రూపొందిస్తున్నామని చెప్పారు. సెప్టిక్ ట్యాంకు ఆపరేటర్లు టోల్ ఫ్రీ నంబర్ 11420 పై ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సెప్టిక్ ట్యాంకు శుభ్రపరచుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు.
అధికారులు మరియు ఆపరేటర్లు సమన్వయంతో పనిచేసి నగరంలో పరిశుభ్రతను మెరుగుపరచాలని
సూచించారు. కార్యక్రమంలో సిఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఆస్కీ ప్రతినిధి డాక్టర్ రాజ్ మోహన్, సానిటరీ సూపర్వైజర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


