లొంగిపోవాల్సిందే ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశం
మాజీ ఐపీఎస్ అధికారికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
సిట్ కస్టోడియల్ దర్యాప్తునకు ధర్మాసనం అనుమతి
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా
కాకతీయ, నేషనల్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావుకు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్‌రావును కస్టోడియల్ దర్యాప్తు చేయడానికి ధర్మాసనం ప్రత్యేక దర్యాప్తు బృందాని (సిట్)కు అనుమతి ఇచ్చింది. ఆయనకు భౌతికంగా ఎలాంటి హాని లేకుండా చూడాలని తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేస్తూ చట్టప్రకారం ప్రభాకర్‌రావు దర్యాప్తు ప్రక్రియ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.
సమాచారాన్ని ముందే డిలీట్ చేశారు
పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పిస్తూ విచారణకు సహకరించాలని న్యాయస్థానం చెప్పినా ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఐక్లౌడ్ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసి అందులోని వివరాలను దర్యాప్తు అధికారులకు చూపించాలని కోర్టు ఆయనకు చెప్పినప్పటికీ కేవలం రెండు పాస్‌వర్డ్‌లను మాత్రమే రీసెట్ చేశారని తెలిపారు. అందులో రీసెట్ చేసిన రెండు అకౌంట్లలోని సమాచారాన్ని ముందే డిలీట్ చేశారని చెప్పారు. కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ కోర్టు పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పించడం వల్ల దర్యాప్తునకు ఏమాత్రం సహకరించట్లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని దీనిపై మీరేమంటారని ప్రభాకర్‌రావు తరఫున న్యాయవాది రంజిత్ కుమార్‌ను ప్రశ్నించారు. పిటిషనర్ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్న పలు విషయాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసినట్లు ఆయన చెప్పారు.
తదుపరి విచారణ వాయిదా
కేసు దర్యాప్తునకు సహకరిస్తున్న వివరాలతో కూడిన అఫిడవిట్‌ను మంగళవారం సాయంత్రం 4 గంటలకు దాఖలు చేయడంతో దానిని పరిశీలించలేదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చెప్పారు. అభిప్రాయం చెప్పడానికి సమయం ఇవ్వాలని కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేశారు. ఇరువైపులా వాదనలు పరిశీలించిన ధర్మాసనం చివరగా సిట్ అధికారి ఎదుట ప్రభాకర్‌రావు లొంగిపోవాలని ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల పాటు జరిగే ఈ కస్టోడియల్ విచారణలో ఇంటి నుంచి భోజనం, ఆరోగ్యానికి సంబంధించిన మందులు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది.


