నమ్మించి సీడ్ కంపెనీ మోసం
ఎకరాకు 30-35 క్వింటాల్స్ వస్తాయని చెప్పింది
8 క్వింటాళ్లు కూడా రాకపోవడంతో లబోదిబోమంటున్న రైతులు
రైతు కమిషన్ ను ఆశ్రయించిన మెదక్ జిల్లా రైతులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన రైతులు రైతుకమిషన్ గడప తొక్కారు. నకిలీ వరి విత్తనాలతో మోసపోయామని, తమకు న్యాయం చేయాలని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని వేడుకున్నారు. ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీని నమ్మి 40 మంది రైతులు 100 ఎకరాలకుపైగా వరి సాగుచేస్తే.. ఆశించిన దిగుబడి రాలేదని, పెట్టిన పెట్టుబడి కూడా పోయిందన్నారు. సీడ్ కంపెనీ వాళ్ళు..ఎకరానికి 30-35 క్వింటాళ్ల ధాన్యం పండుతుందని, కోత సమయంలో వచ్చి ప్రభుత్వం ఇచ్చే ధరకంటే క్వింటాల్ కు అదనంగా 150 రూపాయలు ఇస్తామని ఆశపెట్టారని తెలిపారు. కానీ ఇప్పుడు చూస్తే నకిలీ విత్తనాలతో ఎకరాకు 8 క్వింటాళ్లు రావడంతో వరి సాగుచేసిన రైతుల్లో ఆందోళన మొదలైందని కమిషన్ కు రుక్మాపూర్ రైతులు వివరించారు. ఇప్పటికే సీడ్ కంపెనీల మోసాన్ని కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఐతే అధికారులు కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారు కానీ తమకు నష్టపరిహారం ప్రకటించడం లేదన్నారు. రైతు కమిషన్ చొరవ తీసుకొని రుక్మాపూర్ రైతులకు సత్వర న్యాయం చేయాలని కోరారు. రుక్మాపూర్ రైతుల ఆవేదన విన్న కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి.. కమిషన్ తరుపున ఒకటిరెండ్రోజుల్లో అధికారులను ఫీల్డ్ లోకి పంపి నివేదిక తెప్పించుకున్న తర్వాత న్యాయం జరిగేలా చూస్తామని కోదండరెడ్డి హామీ ఇచ్చారు.


