ప్రశాంతంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు
– ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్
– మండలంలో 9 గంటల వరకు 27% ఓటింగ్
– దుబ్బ తండలో హరిత పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, రాయపర్తి: రాయపర్తిలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా 9 గంటల వరకు 27% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 6495 పురుషులు, 5250 ఉంది స్త్రీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఓటు హక్కును వినియోగించుకోవడానికి వృద్ధులు,యువత పోలింగ్ కేంద్రాలకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మండలంలోని దుబ్బ తండలో ఏర్పాటుచేసిన హరిత పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించారు.ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఓటర్లకు సూచించారు. ఓటు వేయడానికి మధ్యాహ్నం ఒంటిగంట వరకే సమయం ఉందని గడువులోగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి, తహసిల్దారు ముల్కనూరి శ్రీనివాస్, ఎంపీడీవో గుగులోత్ కిషన్ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.



