ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పాటించాలి
కలెక్టర్ కోయ శ్రీ హర్ష
కాకతీయ, పెద్దపెల్లి : మొదటి విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా, ఎటువంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు.డిసెంబర్ 11 జరుగనున్న పోలింగ్‌కు సంబంధించి బుధవారం మంథని, ముత్తారం, రామగిరి, కమానపూర్, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాల్లో వివరించిన అన్ని మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ సిబ్బంది తమ విధులను నిర్వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏ మాత్రం అలసత్వానికి తావుండకూడదని హెచ్చరించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ విషయంలో చెక్‌లిస్టు ఆధారంగా జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైన అన్నిరకాల సామగ్రి సిబ్బందికి పూర్తి స్థాయిలో అందించాలని సూచించారు. ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్ల రవాణాలో తప్పనిసరిగా సాయుధ బందోబస్తు ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.పోలింగ్ సిబ్బంది, పోలీసు బందోబస్తు తరలింపుకు వినియోగించే వాహనాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి, సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా పర్యవేక్షణ బలపడాలని అధికారులకు చెప్పారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి తాగునీరు, వైద్య శిబిరం, అల్పాహారం, భోజనం, ఎలక్ట్రిసిటీ, వాహనాలు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.మంథని బాలికల ఉన్నత పాఠశాలను కూడా కలెక్టర్ సందర్శించారు.కలెక్టర్‌తో పాటు ఏసీపీ రమేష్, జడ్పీ సీఈఓ నరేందర్, ఆర్డీవోలు గంగయ్య, సురేష్, ఎంపీడీవోలు, ఎంసీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


