పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు
కమిషనరేట్ పరిధిలోని విధుల్లో 2 వేల మంది పోలీసులు
పోలింగ్ కేంద్రాల వద్ద పెట్రోలింగ్ పెంపు
2,205 మంది బైండోవర్..
అల్లర్లకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు
వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరిక
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రేపు జరగనున్న గ్రామ పంచాయితీ మొదటి విడత ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు మొత్తం 2 వేలకుపైగా పోలీసు సిబ్బందిని నియమించినట్లు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు ఇలా వెల్లడించారు.. బందోబస్తు బలగాలకు సంబంధించి ముగ్గురు డీసీపీలు, 5 మంది అదనపు డీసీపీలు, 13 మంది ఏసిపిలు, 28 మంది ఇన్‌స్పెక్టర్లు, 122 మంది ఎస్.ఐలు, 412 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 1,154 మంది కానిస్టేబుళ్లు, 285 మంది హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజల్ బృందాలు, ప్రతి మండలానికి ఒక ఏసిపిని ఇన్‌చార్జ్‌గా నియమించగా, అదనపు డీసిపి పర్యవేక్షణలో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ పనిచేస్తుందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎస్.ఐ, ఏఎస్.ఐతో పాటు తగిన సంఖ్యలో కానిస్టేబుళ్లను మోహరించినట్లు చెప్పారు. రూట్ మొబైల్ టీంలు, షాడో పార్టీలు, మొబైల్ పార్టీలు నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తాయని చెప్పారు.
గ్రామాల్లో ముమ్మర తనిఖీలు
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి చెక్‌పోస్టుల వద్ద భారీ వాహన తనిఖీలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. గ్రామాల్లో కూడా ముమ్మర తనిఖీలు జరిగాయని చెప్పారు. స్వాధీనం చేసిన నగదు.. రూ. 6,04,000, 120 కేసుల్లో మద్యం సీసాలు రూ. 10.69 లక్షల విలువ, 46 కేసుల్లో గుడుంబా 322 లీటర్లు దాదాపు రూ. 1.19 లక్షల విలువ ఉంటుందని, తెలిపారు. స్వాధీనం చేసిన గంజాయి రూ. 1 లక్ష విలువ, లైసెన్స్ ఉన్న తుపాకులు 156 స్వాధీనం చేసుకున్నారని, అలాగే గతంలో ఎన్నికల వివాదాలకు సంబంధించిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానితులపై ప్రత్యేక దృష్టి పెట్టి 384 కేసుల్లో 2,205 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు.
ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి..
ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేసిన పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలకు విఘాతం కలిగించే చర్యలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.


