స్థానికంగానూ ప్రజా ప్రభుత్వమే ఉండాలి
రేవంత్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి బాట
బీఆర్ ఎస్ కల్లబొల్లి మాటలు గ్రామాల ప్రజలు నమ్మొద్దు
కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలి
హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి
కాకతీయ,ఆత్మకూరు : కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకుంటామని హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి పర్వతగిరి మహేశ్వరి రాజును గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇనుగాల మాట్లాడుతూ ఆత్మకూరు మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. బీఆర్ ఎస్ నాయకులు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి.. జనాలను పీడించారని అన్నారు. బీఆర్ ఎస్ నాయకులు మళ్లీ కల్లబొల్లి మాటలతో.. సెంటిమెంటు డైలాగులతో జనాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను ఆరంభించారని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకం సంక్షేమ, అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి సర్కారుపై ఉన్న నమ్మకమే తెలంగాణ రైజింగ్‌కు లభించినా స్పందన నిదర్శనమన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే.. స్థానిక సంస్థల్లో అధికారంలోకి వస్తే గ్రామాలకు మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలని ఈసందర్భంగా ఇనుగాల పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


